పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...