ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి.

శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది.

దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది.

“ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు.

ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణానికి బయలుదేరాడు. శాస్త్రి ఉంటున్న గ్రామం నుండి, పట్టణానికి చేరాలంటే మధ్యలో కొంత అడవి కుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయినా సరే వెనకాడకుండా శాస్త్రి ప్రయాణం మొదలు పెట్టాడు. కొన్ని గంటలకు అడవి మధ్యదాకా వచ్చాడు.

అప్పటికి సమయం మిట్టమధ్యాన్నం కావస్తున్నది. శాస్త్రికి దాహం అధికంకాసాగింది. దాంతో ఎక్కడైన నీళ్ళు లభిస్తాయేమోనని, చుట్టు ప్రక్కల పరిశీలనగా చూసాడు. అక్కడకి కొన్ని గజాల దూరంలో ఏదో జలం ఉన్న ప్రదేశం కనిపించి అటు వైపు అడుగులు వేసాడు. తీరా చూస్తే అది ఒక బురద నేల. పైన కొద్దిగా నీళ్ళు కనిపిస్తున్నా రెండు అడుగులు ఆ బురదలో నడిస్తే అందులో మెడలదాకా కూరుకుపోవటం ఖాయం అని అర్థం అయి వెనక్కి తిరిగాడు.

సరిగ్గా అప్పుడే ఎవరో పిలిచినట్టు అనిపించి గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఆ చిత్తడి నుండే ఆ పిలుపు వచ్చిందని గ్రహించి, జాగ్రత్తగా అటువైపు నడిచాడు. అప్పుడు పరిశీలనగా చూస్తే అతనికి కనిపించారు. ఆ చిత్తడి నేలలో తల వరకూ కూరుకుపోయిన ఒక మనిషి, ఒక పెద్ద పులి, ఒక పాము, ఒక కోతి చావటానికి సిద్ధంగా ఉన్న తమని కాపాడమని వారంతా శాస్త్రిని బ్రతిమిలాడారు.

శాస్త్రికి ఏంచేయాలో అర్థంకాలేదు. ఇంతలో పులి ఇలా అన్నది. ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి నన్ను ఈ ఊబి నుండి బయటికి లాగు, నీ మేలు మర్చిపోను. దానికి శాస్త్రి ఇలా అన్నాడు. ఓ పులీ! నీవు పూర్తిగా క్భూరమైన జీవివి. నిన్ను రక్షిస్తే, నీవు బైటపడి నన్నే తింటావు అన్నాడు భయంగా.

అప్పుడు పులి ఇలా అన్నది ఓయీ! అమాయకుడా, నాకు ప్రాణం దానం చేసే నీవు దైవంతో సమానం. నీకు హాని చేస్తానా అన్నది దీనంగా- పులి మాటలకు జాలిపడిన శాస్త్రి ఆ ప్రాంతంలో దొరికిన చెట్టు ఊడను తెచ్చి, ఒక కొసను తను పట్టుకొని, రెండో కొసను పులి మీదకు విసిరాడు. దాంతో ఆ పులి జాగ్రత్తగా ఆ చెట్టు ఊడ కొసను పట్టుకొని ఒడ్డుకు చేరి శాస్త్రికి నమస్కారంచేసి ఇలా అన్నది. ఓ నాయనా! నా ప్రాణం కాపాడవు.

నీకు నాకృతజ్ఞతలు, నీకు వీలైనప్పుడు ఇక్కడికి మూడు క్రొసుల దూరంలో ఉన్న నా గుహకిరా, నీకు తగిన బహుమానం ఇస్తాను. ఇలా చెప్పి ఆ పులి వెళ్ళి పోయింది.

ఆ తర్వాత మనిషి తనను కూడా కాపాడమని శాస్త్రిని బ్రతిమిలాడసాగాడు. శాస్త్రి మనసు కరిగి పోయి, ఆ మనిషిని రక్షించాలని అనుకున్నాడు.

అప్పుడు ఆ ఊబిలో ఉన్న కోతి, పాము శాస్త్రితో ఇలా అన్నాయి. ఓ అమాయుకుడా! ఈ మనిషి పరమ నీచుడు. దుర్మార్గుడు. వీడిని గానీ రక్షించావంటే నీకు హాని జరుగుతుంది.

అయినా శాస్త్రి ఏమీ ఆలోచించకుండా ఆ ఊబిలో ఇరుక్కున్న మనిషిని మర్రి ఊడ సాయంతో బయటికి లాగాడు. ఆ మనిషి బయటికి వచ్చి శాస్త్రితో ఇలా అన్నాడు. ఓయీ ప్రాణాదాతా! నన్ను రక్షించిన నీ మేలు ఎన్నాడూ మర్చిపోను.

నీకేదైనా అవసరం వస్తే నన్ను కలుసుకో, నేను దగ్గరలో ఉన్న 'చెల్లూరు' గ్రామంలో బంగారు వస్తువులు ఆభరణాలు చేసే కంసాలిని, అని చెప్పి కంసాలి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత శాస్త్రి కోతిని, పాముని రక్షించి, ఒడ్డుకు చేర్చి తన దొవన తను పట్టణానికి బయలుదేరాడు. శాస్త్రి పట్టణం చేరి చాలా మంది వైశ్యుల రాజుల ఇంట పూజలు జరిపించి చాలా ధనం దక్షిణాలుగా గడించాడు. అలా మూడు నెలలు గడిచాయి. శాస్త్రి సంతోష పడి ఇక భార్య, బిడ్డల దగ్గరకు వెళ్ళి పోవాలని నిర్ణయించుకొని ఒక శుభముహుర్తంలో తాను సంపాదించిన ధనాన్ని భద్రంగా ఒక మూటగా కట్టి, 'వేండ్ర’ గ్రామానికి ప్రయాణం మొదలు పెట్టాడు.

మళ్ళీ అడవిలోకి వచ్చాడు. అప్పుడు శాస్త్రికి ఒక ఆలోచన వచ్చింది. తను ప్రాణదానం చేసిన వాళ్ళు తనకి మళ్ళీ ఉపకారం చేస్తామని వాగ్దానం చేసారు కదా! వాళ్ళని ఇప్పుడు కలిస్తే ఏమైన ఇస్తారేమో చూడాలి. దాంతో శాస్త్రి గబ,గబా నడుస్తూ పులి ఉన్న గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో ఉన్న పులి శాస్త్రిని చూసి, ఓయీ! బ్రాహ్మణుడా ఆనాడు నా ప్రాణం కాపాడవు. అందుకు ప్రతిఫలంగా నీకు ఈ ఆభరణాలు ఇస్తున్నాను తీసుకో అని కొన్ని హారాలు, ఉంగరాలు శాస్త్రికి ఇచ్చింది.

వాటిని చూసి శాస్త్రి చాలా ఆనందించాడు. అయినా అనుమానంగా అడిగాడు. ఓయీ! పులిరాజా! ఇంత ఖరీదైన నగలు నీకు ఎలా లభించాయి. అప్పుడు పులి ఇలా అన్నది.

ఒకసారి ఒక రాజ కుమారుడు ఈ అడవికి వేటకు వచ్చాడు. నేను అతడిని చంపి తినేసాను. ఆ తర్వాత అతడి ఆభరణాలు తీసుకొని భద్రపరిచాను. దాంతో శాస్త్రి గట్టిగా నిట్టూర్చి, ఆ ఆభరణాలు తన సంచీలో సర్దుకొని, పులి దగ్గర వీడ్కొలు తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు.

కొంతదూరం నడిచాక ఒక కోతి ఎదురు పడింది. అది వేరే ఎవరోకాదు శాస్త్రి గతంలో రక్షించిన కోతే. ఆ మర్కాటం శాస్త్రిని గుర్తు పట్టి, ఆపేక్షగా పలకరించి, కాసిని పళ్ళు, కాయలు పెట్టింది. ఆకలి మీదున్న శాస్త్రి ఆ పళ్ళను సగం తిని, మిగిలినవి సంచీలో పెట్టుకొని కోతి దగ్గర వీడ్కొలు తీసుకొని బయలుదేరాడు.

అలా వెళ్తుండగా శాస్త్రికి ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే పులి ఇచ్చిన నగల్ని, చెల్లూరులో తాను కాపాడిన కంసాలికి అమ్మి, మరి కొంత డబ్బు సంపాదించాలిని. ఆలోచన తట్టిన మరుక్షణం శాస్త్రి 'చెల్లూరు' గ్రామం వెళ్ళి, కంపాలిని కలిసాడు. శాస్త్రిచే కాపాడబడ్డ కంసాలి శాస్త్రిని గుర్తుపట్టి ఆహ్వానించి ఆదరంగా కూర్చోపెట్టి ఓయి విప్రుడా! ఏమిటి ఇలా వచ్చారు. నా వలన కావల్సిన పని ఏమైనా ఉన్నాదా అని వినమ్రంగా అడిగాడు.

అప్పుడు శాస్త్రి తన సంచీలో ఉన్న పులి ఇచ్చిన ఆభరణాలు కంపాలికి ఇచ్చి వాటికి తగిన ధర ఇమ్మని అడిగాడు. ఆ నగల్ని తీసుకొని కంసాలి పరిశీలించి అవి తాను యువరాజు కోసం చేసినవి అని గ్రహించి, పైకి మాత్రం ఏమీ అనకుండా శాస్త్రిని కూర్చోమని చెప్పి ఆ నగలు తీసుకొని దొడ్డి దొవకుండా ఇంట్లోంచి బయలుదేరి రాజుగారిని కలిసి ఆ నగలు ఇచ్చాడు.

రాజుగారు ఆ నగల్ని చూసి తన కుమారుడిని చంపి నగలను శాస్త్రి అపహరించి ఉంటాడని అపోహపడి, భటుల్ని పిలిచి, శాస్త్రిని బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. కంసాలి దుర్మార్గ బుద్ధి వల్ల అమాయకుడైన శాస్త్రి జైలుపాలై దుఃఖించసాగాడు.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శాస్త్రికి గుర్తుకు వచ్చింది. ఆనాడు తనచే రక్షించబడ్డ పాము. అవసరం అయినప్పుడు సహాయం చేస్తానన్న మాట. దాంతో శాస్త్రి ఆ పామును మనస్సులో తల్చుకున్నాడు.

అంతే ఆ పాము శాస్త్రి ముందు ప్రత్యక్షమై ఇలా అన్నది. ఓయి అమాయక శాస్త్రి ఆనాడు నేను చెప్పినా వినకుండా ఆ దుష్ట మానవుడ్ని కాపాడావు. ఇప్పుడు కారాగారంలో పడి అలమటిస్తున్నావు.

అయినా గతం, గతః ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, నీకు అంతా మంచే జరుగుతుంది. ఏం చెయ్యాలి అని ఆత్రుతగా అడిగాడు శాస్త్రి. చూడు... నేను ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుగారి భార్యను కాటు వేస్తాను. నీవు వచ్చి ఆమెని తాకితే చాలు, నా విషం విరిగిపోయి ఆమె బ్రతుకుతుంది. తన భార్యను రక్షించినందుకు ఆ రాజుగారు నిన్ను ఈ జైలు నుండి విడిపిస్తాడు అన్నది పాము.

ఆ తర్వాత ఆ సర్పం రాణిగారి అంతఃపురాన్ని చేరి, నిద్రిస్తున్న రాణిగారిని కసుక్కున కాటేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. రాణిగారిని పాము కాటేసింది అన్న మాట విని, రాజుగారు హడవుడిగా అంతఃపురం చేరి, రాజ వైద్యుల్ని అందర్నీ రప్పించారు.

రాజు వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మందులు వాడినా రాణీ గారు లేవలేదు.

దాంతో రాజుగారు ఆందోళన చెంది రాణీగారిని కాపాడిన వారికి మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఎందరో వైద్యులు వైద్యం చేసారు. కానీ రాణీగారికి సృహరాలేదు. చివరిగా శాస్త్రికి అవకాశం ఇవ్వబడింది.

శాస్త్రి రాణిగారి తల్పం దగ్గరకు వెళ్ళి, ఏదో చదువుతున్నట్టుగా పెదవులు కదుపుతూ, రాణిగారి చెయ్యిని తాకాడు. అంతే పాము విషం విరిగిపోయి, రాణీగారు లేచి కూర్చున్నారు.

దాంతో రాజుగారు సంతోషించి శాస్త్రిని క్షమించేసారు. అప్పుడు శాస్త్రి జరిగినదంతా చెప్పి తన నిర్దోషిత్వాన్ని వివరించాడు.

రాజుగారికి అంతా అర్థమయింది. వెంటనే కృతజ్ఞతుడు అయిన ఆ కంసాలి కారాగారంలో వేయించి, శాస్త్రికి మంచి బహుమతులు ఇవ్వటమే కాకుండా తన ఆస్థాన పురోహితుడిగా ఉద్యోగం కూడా ఇచ్చాడు.

ఆ తర్వాత శాస్త్రి భార్యా బిడ్డలతో రాజుగారి ఆస్థాన పురోహితుడిగా ఉంటూ, సకల భోగాలు అనుభవిస్తూ కాలం గడిపాడు.

నీతి : మంచి చెప్పే మిత్రుల మాట వినాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...