ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోసకారి నక్క | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నేపాల్ అడవుల్లో ఒక మృగరాజు ఉండేది. దానికి ఒక నక్క, ఒక తొడేలు సలహాదారులుగా ఉండేవి. ఒకసారి ఆ సింహం ఒక ఆడ గుర్రాన్ని చంపింది. ఆ తర్వాత దాని పొట్ట చీల్చగా అందులో సజీవంగా ఉన్న ఒక గుర్రపు పిల్ల కనిపించింది. ఆ గుర్రపు పిల్లను చూసి సింహానికి జాలి వేసి దాన్ని చంపకుండా తన వద్ద ఉంచుకుని పెంచసాగింది.

కాలక్రమంలో ఆ గుర్రపు పిల్ల పెద్ద గుర్రంగా మారింది. సింహానికి సలహాదారులుగా ఉన్న నక్క, తొడుళ్ళకు ఆ బలిసిన గుర్రాన్ని చూస్తే నోరు ఊరేది. కానీ ఆ గుర్రం రాజుగారి పెంపుడు బిడ్డతో సమానం కనుక నొర్మూసుకొని ఉన్నాయి.

ఒకసారి ఆ సింహం ఒక అడవి దున్నల గుంపుపై దాడిచేసింది. అయితే ఆ మదించిన దున్నలు సింహాన్ని తమ కొమ్ములతో తీవ్రంగా గాయపరిచాయి. దాంతో సింహానికి చచ్చినంత పని అయింది. అలా అడవి దున్నల వల్ల తీవ్రంగా గాయపడ్డ సింహం బలహీన పడింది. దాంతో అది గుహ దాటి బైటికి వెళ్ళటం మానేసింది.

ఒకరోజు ఆ సింహం నక్క, తొడేలును పిలిచి ఏదైనా జంతువును మన గుహలోకి తరుముకు రండి దాన్ని నేను చంపేస్తాను. మనం హాయిగా దాన్ని తిందాం అన్నది. ఇక రాజుగారి మాట తీసివేయలేక తొడేలు, నక్క అడవి అంతా తిరిగాయి ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని కానీ వాటి దురదృష్టమా అన్నట్టుగా ఆ రోజు ఏ జంతువు వాటికి కనబడలేదు.

దాంతో తొడేలు, నక్క ఆకలితో ఒక చెట్టు క్రింద కూలబడ్డాయి. అప్పుడు జిత్తుల మారి నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే సింహం గుహలో ఉన్న గుర్రాన్ని కనక చంపేస్తే ఒక వారం పాటు సుష్టుగా భోజనం చెయ్యవచ్చు. తనకు వచ్చిన ఈ ఆలోచనను ప్రక్కనే ఉన్న తొడేలుకి కూడా చెప్పింది.

ఆ ఆలోచన తొడేలుకి బాగా వచ్చింది. కానీ గుర్రాన్ని చంపుతే రాజుగారు మనల్ని చంపుతారు అన్నది సందేహంగా. అప్పుడు నక్క, ఔను మనం చంపితే సింహం ఖచ్చితంగా మనల్ని చంపుతుంది. అదే సింహం చేతిలో ఆ గుర్రాన్ని చంపించాం అనుకో మనచేతికి మట్టి అంటకుండా హాయిగా కావాల్సినంత గుర్రపు మాంసం లాగించవచ్చు అన్నది. ఆ నిర్ణయానికి వచ్చి గుర్రాన్ని దగ్గరగా పిలిచి ఇలా అన్నాయి.

ఓ మిత్రుడా! నీకు తెలుసు మన రాజుగారికి ఆరోగ్యం బాగాలేదని ఆయనకు గుర్రపు మాంసం పెడితే ఆరోగ్యం వస్తుందని అడవి వైద్యులు చెప్పారు అని. దానికి గుర్రం అయ్యో అలాగా, రాజుగారికి గుర్రపు మాంసం ఇస్తే ఆరోగ్యం చక్కబడుతుంది అంటే నేను మరణించి రాజుగారికి ఆహారం అవుతా అన్నది.

సరేలే నీకు ఇష్టమైతే సింహంగారికి ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు అన్నాయి నక్క, తొడేలు. ఆ తర్వాత నక్క సింహం దగ్గరికి వెళ్ళి ప్రభూ! మీ కోసం మన గుర్రం మిత్రుడు ఆహారంగా మారతానని ప్రాధేయపడు తున్నాడు. మీరు, ఈ గుర్రాన్ని నిస్సంకోచంగా చంపి, ఆహారంగా స్వీకరించండి అని ప్రార్థించింది. మొదట సింహం గుర్రాన్ని చంపటానికి అంగీకరించక పోయినా, ఆకలి బాధ తట్టుకోలేక అంగీకరించింది. గుర్రాన్ని గుహలోకి రమ్మని నక్క పిలిచింది. సింహం ఒకే ఒక్క దెబ్బతో గుర్రాన్ని చంపేసింది.

ఆ తర్వాత సింహం నక్కని తొడేల్ని పిలిచి గుర్రపు మాంసాన్ని తినే ముందు స్నానం చేస్తే మంచిది. కనుక నేను అలా నది దాకా వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈలోపు మీరు ఈ గుర్రపు మాంసాన్ని ఎవరూ ఎంగిలి చేయకుండా కాపాడండి అని చెప్పి స్నానం చేయటానికి నదికి వెళ్ళింది. ఇక గుర్రపు శరీరానికి నక్క, తొడేలు కాపలాగా ఉన్నాయి. వాటికి గుర్రపు మాంసం చూసి నోరూరి పోతున్నది. పైగా వారం రోజులు నుండి తిండిలేదు.

అయినా సింహం అంటే ఉన్న భయం వల్ల నోరు కట్టుకుని గుర్రం మాంసాన్ని కళ్ళప్పగించి చూస్తున్నాయి. అప్పుడు జిత్తులమారి నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే సింహాన్ని, తొడేలుని కూడా ఆవతలికి తరిమివేస్తే ఆ మొత్తం గుర్రాన్ని తానే ఒక నెల రోజులు హాయిగా తినవచ్చు అనుకున్నది నక్క ఆలోచనగా. ఆలోచన తట్టిందే ఆలస్యం నక్క వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టింది.

తొడేలుతో నక్క ఇలా అన్నది. ఓ తొడేలు బావా! నీవు ఆహారం తిని దాదాపు వారం రోజులు అయింది. కాస్త గుర్రపు మాంసం తినరాదా! ఆ మాటకి తొడేలు నాకూ తినాలనే ఉన్నది కానీ పాడు సింహం మధ్యలో వస్తే నన్ను చంపిపారేయదా? అన్నది. సింహం చాలా నీరసంగా ఉన్నది. అది నది కెళ్ళి రావాలంటే చాలా సేపుపడుతుంది. ఈలోగా నీవు కాస్త మాంసం తిను ఫరవాలేదు. అని తొడేలును బాగా ప్రోత్సాహించింది జిత్తుల మారి నక్క.

నక్క ప్రోత్సాహంతో తొడేలు గుర్రపు మాంసాన్ని కొంచెం కొంచెం తినసాగింది. ఇంతలో హఠత్తుగా సింహం స్నానం చేసి వచ్చేసరికి గుర్రాన్ని తింటున్న తొడేలు కనిపించింది.

దాంతో సింహానికి ఆగ్రహం గట్లు తెంచుకుని పెద్దగా గర్జించింది. సింహం ఆవేశం చూసి తొడేలు పుంజాలు తెంపుకొని అడవిలోకి పరారు అయింది.

ఇంతలో వందల కొద్ది గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. దాంతో సింహం నక్కను పిలిచి, ఆచప్పుడు ఏమిటో చూసిరా అన్నది. నక్క బయటికి వెళ్ళి చూసింది. అవి తప్పిపోయి అడవంతా తిరుగుతున్న అడవి గుర్రాలు అని గ్రహించింది నక్క-

సింహం దగ్గరకు వెళ్ళి ఓ రాజా! నీవు గుర్రాన్ని చంపావని అనేక వందల గుర్రాలు నిన్ను చంపాలని వస్తున్నాయి. నీకు చావు తప్పదు అని బెదిరించింది. దాంతో సింహానికి వణుకు పుట్టి ఆ గుహలోంచి అడవిలోకి పారిపోయింది. అప్పుడు నక్క తాపీగా గుర్రపు మాంసాన్ని హాయిగా ఒక నెలరోజులు భుజించింది.

నీతి : స్వార్థపరులకి స్నేహితులు ఉండరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...